ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులలో ఒకటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ నగరం ఉలిక్కిపడింది. బుధవారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది. పేలుడు శబ్దం దాదాపు 25 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించింది. చాలా భవనాల్లోని కిటికీలు, తలుపులు కొట్టుకున్నాయి. పాత కాలం గోడలు కూలిపోయాయి. చిమ్మచీకట్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. దాదాపు రెండున్నర గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
ఇక పేలుడు శబ్దంతో తాము భయకంపితులమయ్యామని పోర్టుకు సమీపంలో నివసిస్తున్నవారు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని, బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత ఉపఖండంతో పాటు, ఆఫ్రికా, ఆసియాకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా జరుగుతుంది.