కాబుల్ విమానాశ్రయంలో రాగల 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. కాబుల్‌లో ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా ఉందని.. రాగల 24 నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి దాడులు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అందువల్ల కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రజలంతా సాధ్యమైనంత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దాడిపై విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.
కాగా.. కాబుల్ విమానాశ్రయంలో వెలుపల గురువారం సాయంత్రం జరిగిన ఆత్మహుతి దాడుల్లో 180 మందకి పైగా ప్రజలు మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. గురువారం ఉదయం దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా చెప్పగా.. కొన్ని గంటల్లోనే దాడి జరిగింది. ప్రస్తుతం మరోసారి అమెరికా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
కాగా.. గత రెండు వారాల్లో అమెరికా నేతృత్వంలో దాదాపు 1.2లక్షల మందిని వివిధ దేశాలకు తరలించినా ఇంకా కొన్ని వేల మంది విమానాశ్రయం వద్ద ఉన్నారు. ఈనెల 31(మంగళవారం) లోగా అందరిని తరలించడం సాధ్యమైనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అన్ని పత్రాలు ఉన్న వారినే విమానాశ్రయం లోపలకు అనుమతిస్తున్నారు. ఇంకా 5,400 మంది ప్రజలు టెర్మినల్ భవనంలో తమ వంతు కోసం వేచిచూస్తున్నట్లు అమెరికా వర్గాలు ఉన్నాయి.