తాలిబన్ల ఆక్రమణ.. తొలిసారి నోరు విప్పిన బైడెన్.. అది మా లక్ష్యం కాదు
Biden Defends Decision to Pull Out of Afghanistan.అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ నిర్ణయం
By తోట వంశీ కుమార్ Published on 17 Aug 2021 10:05 AM ISTఅఫ్గనిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలాల ఉపసంహరణ నిర్ణయం తరువాత నుంచి అఫ్గనిస్థాన్ దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. తాలిబన్లు ఒక్కొ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ దేశ రాజధాని కాబుల్‌ను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్ఘానిస్థాన్‌లో తలెత్తిన సంక్షోభానికి కారణం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తీసుకున్న నిర్ణయాలే కారణం అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా.. దీనిపై తొలిసారి జో బైడన్ పెదవి విప్పారు. అఫ్గాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అఫ్గాన్ గడ్డపై నుంచి బలగాలను ఉపసంహరించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదని.. 20 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని గ్రహించానని చెప్పారు. అనుకున్న దానికంటే వేగంగా తాలిబన్లు అప్గాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారన్నారు.
తన ముందు రెండే మార్గాలు ఉన్నాయని, వాటిలో ఒకటి ఆఫ్ఘన్ నుంచి దళాలను ఈ ఏడాది వెనక్కి రప్పించడం కాగా, రెండోది ఆఫ్ఘన్‌కు మరిన్ని సైనిక బలగాలను పంపి మూడో దశాబ్దంలోనూ యుద్ధాన్ని కొనసాగించడమని పేర్కొన్న బైడెన్.. తాను మొదటి మార్గాన్నే ఎంచుకున్నట్టు చెప్పారు. గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నానని వివరించారు. సైన్యం ఉపసంహరణ నిర్ణయానికే తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాలిబన్లు.. అమెరికా ప్రజలపై దాడిచేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇక తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని తనకు తెలుసనన్నారు. అయితే.. మరో దేశ అంతర్యుద్ధంలో పోరాడాలని సైనిక బలగాలకు తాను చెప్పలేనన్నారు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం తప్పితే, ఆఫ్ఘన్ జాతి నిర్మాణం తమ లక్ష్యం కాదన్నారని బైడెన్ తెలిపారు.