బార్‌లో కాల్పులు.. తొమ్మిది మంది మృతి

Bar shooting leaves 9 dead in central Mexican.మెక్సికో దేశంలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 7:51 AM GMT
బార్‌లో కాల్పులు.. తొమ్మిది మంది మృతి

మెక్సికో దేశంలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఓ బార్‌లో తుపాకులు గ‌ర్జించాయి. ఈ కాల్పుల్లో 9 మంది మ‌ర‌ణించ‌గా ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న సెంట్ర‌ల్ మెక్సికో గున‌జుటో రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సెలయా వెలుపల ఉన్న అపాసియో ఎల్ ఆల్టో పట్టణంలో బుధవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఓ సాయుధ బృందం బార్ వద్దకు వచ్చి లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాల్పుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు మరణించ‌గా.. మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వీరి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దుండ‌గుల‌కు ఇంకా గుర్తించ‌లేద‌ని చెప్పారు.

అయితే.. ఘ‌ట‌నాస్థ‌లంలో నేర‌స్తులు రెండు పోస్ట‌ర్లు వ‌దిలివెళ్లారు. అందులో బార్ యాజ‌మాన్యం త‌మ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం జెలిస్కో క్రిమిన‌ల్ గ్యాంగ్‌కు మ‌ద్దుతు ఇవ్వ‌డంతో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన‌ట్లు మారో గ్యాంగ్ పేరిట పోస్ట‌ర్లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. గున‌జుటో రాష్ట్రంలో త‌ర‌చూ గ్యాంగ్ వార్స్ జ‌రుగుతుంటాయి. ఇరుపుటో సిటీలోని బార్‌లో గ‌త నెల‌లో జ‌రిగిన కాల్పుల్లో 12 మంది మ‌ర‌ణించ‌గా సెప్టెంబ‌ర్‌లో అదే ప్రాంతంలో జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story