భారతదేశం నుండి బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను రప్పించడానికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఏకంగా ఇంటర్ పోల్ సహాయం కోరుతుందట. హసీనా ప్రస్తుతం పరారీలో ఉందని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆమెను స్వదేశానికి రప్పించడంలో ఇంటర్‌పోల్ సహాయాన్ని కోరుతున్నామని, ఆమె మీద ఉన్న ఆరోపణలకు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని మధ్యంతర ప్రభుత్వం తెలిపింది.
షేక్ హసీనా, ఆమె పార్టీ నాయకులు విద్యార్థుల ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలని ఆదేశించారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు, దీని ఫలితంగా జూలై-ఆగస్టు నిరసనల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం తర్వాత పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దారి తీసి, హసీనా ఆగస్టు 5న రహస్యంగా భారత్‌కు వచ్చేసింది. నిరసనల సమయంలో 753 మంది మరణించారని ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి షేక్ హసీనా తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తోంది ప్రస్తుత ప్రభుత్వం.