కరెన్సీ నోట్లపై 'జాతిపిత' చిత్రాన్ని తొలగించనున్న బంగ్లాదేశ్..!

బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 11:34 AM IST
కరెన్సీ నోట్లపై జాతిపిత చిత్రాన్ని తొలగించనున్న బంగ్లాదేశ్..!

బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనస్ ప్రభుత్వం ఇప్పుడు బంగ్లాదేశ్ జాతి పిత, ఆ దేశ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని కరెన్సీ నోట్ల పైనుండి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ కొత్త నోట్లను ముద్రించడం ప్రారంభించింది.

మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సూచనల మేరకు..సెంట్రల్ బ్యాంక్ 20, 100, 500, 1000 టాకా (బంగ్లాదేశ్ రూపాయి) నోట్లను ముద్రించడం ప్రారంభించింది. నివేదిక ప్రకారం.. కొత్త నోట్లపై షేక్ ముజ్బీర్ రెహమాన్ చిత్రం ఉండ‌దు. మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, "గ్రాఫిటీ" కొత్త నోట్లలో చేర్చబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ముద్రణ ప్రక్రియ గణనీయంగా పురోగమించిందని బంగ్లాదేశ్ బ్యాంక్ ప్రతినిధి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్నేరా శిఖా తెలిపారు. వచ్చే ఆరు నెలల్లోగా కొత్త నోట్లు మార్కెట్‌లోకి వస్తాయని ఆశిస్తున్నాను అని అన్నారు.

తొలుత నాలుగు నోట్ల డిజైన్లను మాత్రమే మారుస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రం లేని అన్ని రకాల బ్యాంకు నోట్లను దశలవారీగా రీడిజైన్ చేస్తామని చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్ బ్యాంకుకు కొత్త నోటుకు సంబంధించిన వివరణాత్మక డిజైన్ ప్రతిపాదనను సమర్పించింది. కొత్త నోట్లను ముద్రించడానికి ప్రధాన సిఫార్సును సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ అండ్ డిజైన్ అడ్వైజరీ కమిటీ చేస్తుంది.

Next Story