ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోన్న బంగ్లాదేశ్.!
Bangladesh is heading towards financial crisis. కోవిడ్ సంక్షోభంతోపాటు రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలతో భారత్ పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో
By అంజి Published on 15 Aug 2022 1:26 AM GMTకోవిడ్ సంక్షోభంతోపాటు రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలతో భారత్ పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఆర్థికంగా శ్రీలంక ఇప్పటికే పూర్తిగా దివాళా తీయగా.. దాయాది దేశం పాక్ దివాళాటపు అంచుల దాకా చేరింది. ఇక అదే బాటలో బంగ్లాదేశ్ పయనిస్తోంది. దిగుమతుల చెల్లింపులు చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు సరిపడా లేవు. ఈ క్రమంలోనే వచ్చే మూడేళ్లలో 450 కోట్ల డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తలుపుతట్టింది బంగ్లాదేశ్. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న బంగ్లాదేశ్.. 416 బిలియన్ డాలర్ల జీడీపీతో అంతర్జాతీయంగా 33వ స్థానంలో కొనసాగుతున్నది.
బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, సర్వీస్ సెక్టార్‌లు వెన్నముకలాంటివి. కోవిడ్ మహమ్మారి వేళ సర్వీస్ రంగం భారీగా దెబ్బతింది. దీంతో 11 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, 56 శాతం జీడీపీ పడిపోయింది. బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతుంటాయి. అయితే కోవిడ్ టైంలో ఆర్డర్లు రాలేదు. దీంతో గిరాకీ తగ్గింది. వచ్చిన ఆర్డర్లు ఒక్కోసారి రద్దు కావడం, చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఉక్రెయిన్ - రష్యా వార్ వల్ల ముడి చమురు రేట్లు పెరిగాయి. ఇవి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో వాణిజ్య లోటు 33 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. విదేశీ మారక ద్రవ్యం 40 బిలియన్ల డాలర్ల కంటే తగ్గిపోయాయి.
మరోవైపు అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచింది. దీంతో బంగ్లాదేశ్ కరెన్సీ టకా పతనా దిశలోకి వచ్చింది. గతేడాది మేలో డాలర్ విలువ 86 టకాలుగా ఉండగా, ఇప్పుడు 94 టకాలకు చేరింది. ఈ సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఎగుమతులు పెరిగి, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగితేనే బంగ్లాదేశ్ ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోగలదని ఆర్థికవేత్తలు అంటున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ మార్కెట్‌లో ఈ నెల ఐదో తేదీన పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఆక్టేన్ ధరలను బంగ్లాదేశ్ ప్రభుత్వం భారీగా పెంచింది.
విదేశాల్లో నివసించే బంగ్లాదేశీయులు స్వదేశానికి పంపుతున్న నిధులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2020-21లో విదేశాల్లోని బంగ్లాదేశీయులు 24.77 బిలియన్ డాలర్ల నిధులు ఇస్తే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 21.03 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఐఎంఎఫ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు తదితర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల వద్ద రుణాల కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ వద్ద కూడా రుణం కోసం యత్నిస్తున్నది.