క్యాంపస్ హత్య కేసులో 20 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు మరణశిక్ష
Bangladesh Court sentences 20 to death for murdering student.తోటి విద్యార్థిని దారుణంగా హింసించి హతమార్చిన
By తోట వంశీ కుమార్ Published on 10 Dec 2021 2:29 AM GMTతోటి విద్యార్థిని దారుణంగా హింసించి హతమార్చిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించగా.. మరో ఐదుగురు విద్యార్థులకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ ఢాకా కోర్టు తీర్పు నిచ్చింది. బంగ్లాదేశ్ కోర్టు వెలువరించిన ఈ తీర్పు పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగిందని వారు అంటున్నారు.
ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(బీయూఈటీ)లో అబ్రార్ ఫహాద్ (21) అనే యువకుడు చదువుకుంటున్నాడు. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని విమర్శిస్తూ అతడు 2019లో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. అదే యూనివర్సిటీలో చదువుతున్న అవామీలీగ్ పార్టీ విద్యార్థి విభాగం బంగ్లాదేశ్ చాత్ర లీగ్(బీసీఎల్)కు చెందిన 25 మంది విద్యార్థులు అతన్ని క్రికెట్ బ్యాట్, ఇతర వస్తువులతో దారుణంగా హింసించారు. దాదాపు ఆరు గంటల పాటు దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన 2019 అక్టోబర్ 7న జరిగింది.
ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ దేశ వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శల దాడి చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢాకా న్యాయస్థానంలో బుధవారం తుది తీర్పును వెలువరించింది. 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించగా.. మరో ఐదుగురికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పు పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు అబ్రార్ ఫహాద్ కుటుంబానికి న్యాయం జరిగిందని వారు పేర్కొంటున్నారు.