ట్రక్కులో 46 మృతదేహాలు.. చూసి షాకైన పోలీసులు
At least 46 people found dead in Texas trailer truck.మెక్సికో-టెక్సాస్ సరిహద్దులోని ఓ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2022 4:27 AM GMTమెక్సికో-టెక్సాస్ సరిహద్దులోని ఓ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న నిలిపి ఉన్న ట్రక్కులో పదుల సంఖ్యలో మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. వీరంతా మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్న వారిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే..టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో దక్షిణ శివారులో ఓ మారు మూల ప్రాంతంలోని రైలు పట్టాల పక్కన ఓ ట్రక్కు నిలిపి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉండడంతో ట్రక్కు డోర్‌ను తెరిచిన పోలీసులు షాక్ తిన్నారు. అందులో 46 మంది చనిపోయి ఉన్నారు. మరో 16 మంది అనారోగ్యంతో ఉండడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 12 మంది పెద్దవారు కాగా.. నలుగురు చిన్నారులు ఉన్నారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మెక్సికోకి 250 కిలోమీటర్ల దూరంలోని శాన్ ఆంటోనిలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్ పెరిగింది. వలసదారులు ట్రక్కులో వేడి వాతావరణం వల్ల ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.