ప్రయాణీకులతో వెలుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడి పోయింది. ఈ ఘటనలో 32 మంది మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. నేపాల్ గంజ్ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ కి మంగళవారం మధ్యాహ్నాం ప్రయాణీకులతో బస్సు బయలు దేరింది. చయనాథ్ రారా మున్సిపాలిటి పరిధిలోకి వచ్చేసరికి బస్సు ముందు టైర్ పంక్చర్ అయ్యింది. ఆ సమయంలో బస్సు వేగంగా వెలుతుండడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు.
వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 32 మృతదేహాలను వెలికి తీశారు. పర్వత ప్రాంతం కావడంతో గాయపడినవారిని చికిత్స కోసం హెలికాప్టర్లు ద్వారా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మృతుల్లో చాలా మంది హిందూ పండుగ దశైన్ పండుగ జరుపుకునేందుకు స్వస్థలాలకు వెలుతున్నట్లు తెలుస్తోంది.
పర్వత ప్రాంతమైన నేపాల్‌లో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 లో దాదాపు 13 వేల రోడ్డు ప్రమాదాల్లో 2,500 మందికి పైగా మరణించారు.