ఘోర ప్రమాదం.. 32 మంది సజీవ దహనం
At least 32 dead in Bangladesh ferry fire.బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ నౌకలో అగ్నిప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on 24 Dec 2021 5:24 AM GMTబంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌకలో అగ్నిప్రమాదం సంభవించి 32 మంది ప్రయాణీకులు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకొనేందుకు మరికొంత మంది సముద్రంలో దూకారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని జకాకతికి సమీపంలోని నదిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆ నౌకలో దాదాపు 500 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి ఓ మూడంతస్తుల నౌక ప్రయాణికులతో బరుంగా బయలుదేరింది. అయితే.. జకాకతికి సమీపంలోని వెళ్లే సరికి శుక్రవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో నౌకలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నౌకలోని ప్రయాణీకులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకుని 32 మంది సజీవదహనం అయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 100 మందికి పైగా గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారి మోయినూల్ ఇస్తామ్ మాట్లాడుతూ.. నది మధ్యలో నౌక ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తాము 32 మంది మృతదేహాలను వెలికితీశామని, 100 మందికి పైగా గాయపడడంతో ఆస్పత్రులకు తరలించామన్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకారని.. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక నదిలో కూడా గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి ఇప్పటి వరకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదన్నారు. తొలుత ఇంజన్ గదిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోందన్నారు.