గాజాలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది సజీవదహనం.. మృతుల్లో 9 మంది చిన్నారులు
At least 21 killed in Gaza Strip fire.పాలస్తీనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2022 2:43 AM GMTపాలస్తీనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 21 మంది సజీవ దహనం కాగా.. వీరిలో 9 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విషాద ఘటన గాజా నగరంలో చోటు చేసుకుంది.
గాజా స్ట్రిప్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. తొలుత చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హమాస్ ఇస్లామిస్ట్ లు అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పి వేశారు. అప్పటికే 21 మంది సజీవ దహనం అయినట్లు గాజా పౌర రక్షణ విభాగం ఒక ప్రకటనలో ధృవీకరించింది. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది.
పలువురు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. ఆ ఇంట్లో ఇంధనం నిల్వ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి చెప్పారు.
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఈ ప్రమాదాన్ని "జాతీయ విషాదం" గా అభివర్ణించారు. శుక్రవారం సంతాపదినంగా ప్రకటించారు. మెరుగైన వైద్య చికిత్స అందిచేందుకు దక్షిణ ఇజ్రాయిల్, గాజాను కలిపే ఎరేజ్‌క్రాసింగ్ తెరవాలని పాలస్తీనా అధికారులు ఇజ్రాయిల్‌ను కోరారు. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి పాలస్తీనా అధ్యక్షుడు ముందుకు వచ్చారు.
గాజాలోని ఎనిమిది శరణార్థుల క్యాంపుల్లో జబాలియా ఒక్కటి. ఇక్కడ 20 లక్షల నుంచి 30 లక్షల మంది మంది నివాసం ఉంటారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ హమాస్ టెర్రరిస్టులు పాలన చేస్తున్నారు.