ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 20 మంది దుర్మరణం
At Least 20 Killed In Bus Accident In Peru.పెరూ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరపెరూలోని లిబర్టాడ్
By తోట వంశీ కుమార్
పెరూ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరపెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల మేరకు.. పికాఫ్లోర్ కంపెనీకి చెందిన ఇంటర్‌ప్రావిన్షియల్ బస్సు తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెలుతోండగా.. లిబర్టాడ్ రీజియన్‌లో అదుపు తప్పి 100 మీటర్ల లోతులో ఉన్న ఓ లోయలో పడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద శబ్ధం రావడంతో సమీప పట్టణంలోని ప్రజలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తయాబాంబ, హువాన్‌కాస్‌పటా మరియు ట్రుజిల్లోలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. సమాచారం అందుకున్న నేషనల్ పోలీస్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇకపెరూలో అతి వేగం, రోడ్లు సరిగా లేకపోవడం, ప్రమాద సూచికలు లేకపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. 340 కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి రోడ్ల అధ్వాన్న స్థితి కారణంగా 14 గంటల సమయం పడుతుంది. గతేడాది నవంబర్ 10న ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో మినీబస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి పైగా ప్రయాణీకులు మరణించారు.