దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హైవేపై బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన పొగమంచు కారణంగా మూలమలపు వద్ద డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
రేవు పట్టణమైన ముమాకో నుంచి బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ''దురదృష్టవశాత్తూ ప్రమాదం 20 మంది మరణించారు'' అని నారినో డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ పోలీసు కెప్టెన్ ఆల్బర్ట్‌ల్యాండ్ అగుడెలో చెప్పారు. గాయపడిన వారిలో మూడేళ్ల బాలిక, ఎనిమిదేళ్ల బాలుడు ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బ్రేక్ సిస్టమ్‌లో మెకానికల్ వైఫల్యాలను పరిశీలిస్తున్నామని ట్రాఫిక్ అండ్ రవాణా డైరెక్టర్ కల్నల్ ఆస్కార్ లాంప్రియా తెలిపారు.