Earthquake : పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 15 మంది మృతి
ఈక్వెడార్, పెరూలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2023 9:00 AM IST
భూకంపం కారణంగా కుప్పకూలిన భవనం
పెరూ, ఈక్వెడార్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.8గా నమోదు అయినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు 15 మంది మరణించారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంప కేంద్రం పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్ మునిసిపాలిటీ బాలావోలో ఉందని అధికారులు తెలిపారు. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెప్పారు.
ఈక్వెడార్‌లోని మచలా, క్యూన్కా వంటి నగరాల్లో పలు భవనాలు నేల మట్టం అయ్యాయి. రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఈక్వెడార్ ప్రెసిడెంట్ గిల్లెర్మో లాస్సో అన్నారు. గాయపడిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం ధృవీకరించింది.
గ్వాయాక్విల్, క్విటో, మనాబీ, మాంటాతో సహా ఇతర నగరాల్లో కూడా భూమి కంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్యూన్కా నగరంలో కారుపై గోడకూలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, జంబెలీ ద్వీపంలో టవర్ కూలి ముగ్గురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. ఈక్వెడార్ లో 14 మంది, పెరూలో ఒకరు మరణించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.