అక్కడే ఉంటే ఉరి తీసేవాళ్లు.. కట్టుబట్టలు, ఉత్తచేతులతోనే
Ashraf Ghani releases video.తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 11:57 AM ISTతాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయాడు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ. ఆయన దేశాన్ని విడిచి వెలుతూ తన వెంటన ఖరీదైన కార్లు, 116 మిలియన్ల డాలర్ల నగదు తన వెంట తీసుకెళ్లారనే వార్తలు వచ్చాయి. కాగా.. వీటిపై తొలిసారి అష్రాఫ్ ఘనీ స్పందించారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అబుదాబిలో ఘనీ ఉంటున్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో దేశాన్ని విడిచి పెట్టాల్సి వచ్చిందో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
తాను తన స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేదని, దేశంలో రక్తపాతం జరగకూడదని దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినట్టు తెలిపారు. ప్రమాదం ముంచుకొస్తోందని భత్రతా సిబ్బంది హెచ్చరించడం వలనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కట్టుబట్టులు, ఉత్త చేతులతోనే తాను దేశం విడిచి వచ్చానని తెలిపారు. కనీసం కాళ్లకు ఉన్న చెప్పులు విడిచి బూట్లు తొడుక్కునే అవకాశం కూడా లేదన్నారు. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టడం తన ఉద్దేశం కాదని, అక్కడే ఉంటే ఒక అధ్యక్షుడు తాలిబన్ల చేతిలో చనిపోవాల్సి వస్తుందన్నారు.
ప్రస్తుతానికి నేను ఎమిరేట్స్‌లోనే ఉన్నాను. దీనివల్ల అక్కడ రక్తపాతం, గందరగోళం ఆగిపోతాయి అని ఆయన అన్నారు. తాను శాశ్వతంగా యూఏఈలోనే ఉండిపోనని.. ఆఫ్గాన్‌కు తిరిగి వస్తానని ఘనీ చెప్పారు. తాలిబన్లు, ప్రభుత్వ ప్రతినిధులతో తమ మద్దతుదారులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే దేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. మానవతా దృక్పధంతోనే యూఏఈ తనకు ఆశ్రయం ఇచ్చిందని, తాను ఎలాంటి డబ్బు తీసుకొని రాలేదని అన్నారు. కావాలంటే యూఏఈ కస్టమ్స్ అధికారులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.