న్యూయార్క్‌లో భూ ప్రకంపనలు

అమెరికాలోని న్యూయార్క్‌లో భూప్రకంపనలు సంభవించాయి

By Srikanth Gundamalla  Published on  6 April 2024 2:18 AM GMT
america, new york, earthquake,

న్యూయార్క్‌లో భూ ప్రకంపనలు

అమెరికాలోని న్యూయార్క్‌లో భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం ఉదయం భూకంపాలతో స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. న్యూయార్క్‌ నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

న్యూయార్క్‌లో పెద్దగా భూకంపాలు వచ్చిన దఖలాలు లేవు. కానీ శుక్రవారం వచ్చిన భూకంపంతో కోట్ల మంది ప్రజలు భయపడిపోయారు. దీనిపై ముందుగా అధికారుల నుంచి కూడా ఎలాంటి హెచ్చరికలు.. అంచనాలు లేవు. ఒకేసారి భూకంపం రావడంతో 4.2 కోట్ల మంది కలవరపాటుకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 10.23 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ (USGS) వెల్లడించింది. అయితే.. భూకంప కేంద్రాన్ని అధికారులు న్యూజెర్సీలోని వైట్‌ హౌస్‌ స్టేషన్‌కు దగ్గర గుర్తించారు. భూకంప ప్రభావంతో స్థానిక అధికారులంతా అప్రమత్తం అయ్యారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్‌ట్రాక్‌ రైల్వే వ్యవస్థ తమ రైథళ్ల వేగాన్ని తగ్గించింది. అధికారులు వంతెనలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను తనిఖీ చేశారు. బ్రూక్లిన్‌లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్‌, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనల తీవ్రత కనిపించింది.

న్యూయార్క్‌లో భూకంపం రావడంతో.. ఈ ఎఫెక్ట్‌ ఐరాస భద్రతా మండలి సమావేశంపైనా పడింది. ఈ సమావేశానికి స్వల్ప ఆటంకం ఏర్పడింది. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు ఐరాస దౌత్యవేత్తలు శుక్రవారం ఇక్కడ సమావేశం అయ్యారు. కాగా.. సమావేశం జరుగుతుండగా భూకంపం రావడంతో భేటీకి ఆటంకం ఏర్పడింది.

Next Story