అమెరికాలో వర్షాల బీభత్సం, పిడుగుల భయంతో వేల విమానాలు రద్దు

అగ్రరాజ్యం అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  17 July 2023 8:24 AM GMT
America, Heavy Rains, thunderbolt Effect, Flights Canceled,

అమెరికాలో వర్షాల బీభత్సం, పిడుగుల భయంతో వేల విమానాలు రద్దు

అగ్రరాజ్యం అమెరికాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలతోనే జనాలు సతమతం అవుతోంటే మరోవైపు పిడుగులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతుండటంతో దాదాపు 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు అధికారులు. అంతేకాదు.. మరో 8వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఈశాన్య ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూయార్క్‌ లిబర్టీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లోనే ఉన్నాయి. దీంతోపాటు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్టు, లా గార్డియన్ ఎయిర్‌పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జెఎఫ్‌కే ఎయిర్‌పోర్టులో 318 విమానాలు రద్దు అయ్యాయి. మరో 426 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గార్డియన్‌లో 270 విమానాలు రద్దు అయ్యాయి. మరో 292 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు ఎక్కువగా ఉన్న కారణంగా వరదలు ఒకేసారి వచ్చే ప్రమాదం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెటికట్‌, మాస్సాచుసెట్స్‌, వెర్మాంట్‌ ప్రాంతాల్లో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇక కనెటికట్‌, మస్సాచుసెట్స్‌, న్యూహాంప్‌షైర్‌, న్యూయార్క్‌, రోడే దీవిలో టోర్నడో వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు అధికారులు. ఇక విమాన ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వచ్చే ముందే ఫ్లైట్‌ సమయాల గురించి ఆరా తీయాలని వివరించారు. అన్ని తెలుసుకున్న తర్వాతే ఎయిర్‌పోర్టులకు రావాలని చెప్పారు.

ఇదిలా ఉంటే మరోవైపు దక్షిణ, పశ్చిమ అమెరికా ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచి కొడుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story