400 ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు..

గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో విమానంలో మంటలు చెలరేగాయి.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 7:27 PM IST
air Canada, flight, fire,  viral video,

 400 ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. చివరకు..

విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు అన్నీ చెక్‌చేస్తారు సిబ్బంది. అంతా ఒకే అయితేనే విమానం గాల్లో ఎగడానికి అనుమతి ఇస్తారు. అయితే.. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. విమానం గాల్లోకి ఎగిరాక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం జరిగితే.. మరికొన్ని సంఘటనల్లో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. తాజాగా కెనడాలో కూడా ఇలాంటి ప్రమాదమే తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్ది క్షణాల్లో విమానంలో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జూన్‌ 5వ తేదీన ఈ సంఘటన కెనడాలో జరిగింది. ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్ విమానం టొరంటో పియర్సన్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాత్రి 8.46 గంటలకు బయల్దేరింది. ఈ విమానంలో 400 మంది ప్రయాణికులతో పాటు.. సిబ్బంది కూడా ఉన్నారు. విమానం అలా టేకాఫ్‌ తీసుకున్న వెంటనే కుడివైపు ఇంజిన్‌లో చిన్నపాటి పేలుడు సంభవించింది. దాంతో.. మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు రెక్కల వద్దకు వ్యాపించాయి. ఈ విషయాన్ని ఆ ఫైట్‌ నడుపుతున్న పైలట్లు గుర్తించారు. ఈ మాత్రం కంగారుపడకుండా.. జాగ్రత్తగా వ్యవహరించారు. ఎయిర్‌పోర్టులో అధికారులకు సమాచారం ఇచ్చి.. 30 నిమిషాల్లో విమానాన్ని తిరిగి అదే ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారు. ఇక విమానం సేఫ్‌ ల్యాండ్‌ అయిన తర్వాత ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించారు. అందరూ క్షేమంగా ఉన్నారనీ ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనపై ఎయిర్‌కెనడా స్పందించింది. ప్రయాణికులను మరో విమానంలో పంపించామని చెప్పింది. ఇంజిన్‌ కంప్రెసర్‌ వల్లే పేలుడు సంభవించి మంటలు కనిపించాయని పేర్కొంది. సమస్యను పూర్తిగా పరిష్కరించిన తర్వాతే విమానాన్ని తిరిగి సేవల్లోకి అనుమతి ఇస్తామని ఎయిర్‌ కెనడా ప్రతినిధి చెప్పుకొచ్చారు. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంధన ట్యాంకులు ఉన్నాయనీ.. పైలట్లు తెలివిగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందన్నారు. పైలట్లను అధికారులు అభినందించారు.

Next Story