బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరిగాయని ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది. షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత తమ దేశంలో హింసాత్మక ఘటనలు జరిగాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆగస్టు 5 నుంచి అక్టోబరు 22 మధ్యకాలంలో మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగాయని, ఈ హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది.
అక్టోబర్ 22 తర్వాత చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలన్నింటినీ త్వరలోనే చెబుతామని బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. హిందువులపై జరుగుతున్న హింసను ఆపేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.