అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍పై.. మహిళ సంచలన ఆరోపణలు

A woman has made sensational allegations against Amazon CEO Jeff Bezos. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌పై పలు ఆరోపణలు చేస్తూ

By అంజి  Published on  3 Nov 2022 3:19 PM GMT
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‍పై.. మహిళ సంచలన ఆరోపణలు

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. బెజోస్‌ ఇంట్లో గతంలో పని చేసిన ఓ హౌస్‌ కీపర్‌ కోర్టులో.. ఆయనపై దావా వేశారు. జెఫ్‌ ఇంట్లో విధులు నిర్వహించిన సమయంలో జాతి వివక్షను ఎదుర్కొన్నానని ఆరోపించింది. అలాగే అక్కడ దారుణ పరిస్థితుల్లో పని చేశానని చెప్పింది. కనీసం రెస్ట్‌ ఇవ్వకుండా అధిక సమయం వర్క్‌ చేయించుకున్నారని, వాష్‍రూమ్‍లను వాడుకునేందుకు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని తన పిటిషన్‌లో పేర్కొంది. సియాటెల్ స్టేట్ కోర్టులో మర్సెడెజ్ వెడా అనే మహిళ జెఫ్ బెజోస్‍పై ఈ పిటిషన్ వేసింది.

2019లో మర్సెడెజ్‌ వెడా.. బెజోస్ ఇంట్లో ఉద్యోగంలో చేరారు. ఐదుగురు నుంచి ఆరుగురు హౌస్‍కీపర్లకు సూపర్‍వైజర్‍గా విధులు నిర్వర్తించానని ఆమె చెప్పింది. చాలాసార్లు 10 నుంచి 14 గంటలు పని చేశామని, జాతి వివక్షను కూడా ఎదుర్కొన్నామని ఆరోపించింది. జెఫ్ బెజోస్‍తో పాటు ఆయన ప్రాపర్టీలు, పెట్టుబడులను మేనేజ్‍ చేసే జెఫ్రామ్ ఎల్ఎల్‍సీ, నార్త్ వెస్ట్రన్ ఎల్‍ఎల్‍సీపై కూడా మర్సెడెజ్‌ వెడా పిటిషన్‌ దాఖలు చేశారు. హౌస్‍కీపింగ్ సిబ్బంది రెస్ట్‌ తీసుకునేందుకు కనీస స్థలాన్ని కూడా బెజోస్ ఇంట్లో కేటాయించలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు. డ్రెస్‌లు వాష్‌ చేసే రూమ్‍లో తాము ఫుడ్‌ తినాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా అపరిశుభ్రమైన, దయనీయ పరిస్థితుల్లో పని చేశామ, సెక్యూరిటీ గది సమీపంలోని వాష్‌రూమ్‌లను వాడుకోకుండా తమపై ఆంక్షలు విధించారని, కిటికీ ద్వారానే లోపలికి వెళ్లాలని బలవంతం చేసేవారని ఆమె ఆరోపించారు. జెఫ్‌ బెజోస్ ఇంటిని చూసుకునే మేనేజర్లు చాలాసార్లు తమపై దురుసుగా ప్రవర్తించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మర్సెడెజ్ వెడా ఆరోపణలను బెజోస్ తరఫు న్యాయవాది ఖండించారు. బెజోస్ ఇంట్లో పని చేసినందుకు ఆమె ఆరు అంకెల వేతనం పొందారని అన్నారు. బ్రేక్ రూమ్‍లతో పాటు అన్ని సదుపాయాలు హౌస్ కీపర్లకు అందుబాటులో ఉండేవని కోర్టులో చెప్పారు. దురుసు ప్రవర్తన కారణంగానే వెడా జాబ్‌ కోల్పోయిందని కోర్టులో వాదించారు.

Next Story