ఎన్నో అద్భుతాలకు, వింతలు, విశేషాలకు పుట్టిల్లు అయిన భూమిపై ఒక్కో చోట ఒక్కో రకమైన వాతావరణం ఉంటుంది. ఇక ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా భూమిపై వర్షం కురుస్తుంటుంది. కానీ ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదు. నమ్మకం కలగడం లేదా? ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది నిజం. ఈ వింత గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యధికంగా వర్షాలు కురిసే ప్రాంతం మేఘాలయాలోని మాసిన్రామ్ గ్రామంలాగా.. ఎప్పుడూ వర్షాలు పడని గ్రామం కూడా ఉంది. అదే 'అల్-హుతైబ్' గ్రామం. ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది. ఈ గ్రామం భూమికి 3,200 మీటర్ల ఎత్తులో ఓ కొండపై ఉంది. అంటే మేఘాలు ఉండే ప్రదేశం కంటే ఎత్తులో ఈ గ్రామం ఉంది. దీని కారణంగానే ఈ గ్రామంలో వర్షాలు కురవడం లేదు. ఇక వాతావరణ విషయానికొస్తే పగటి పూట ఎండ, రాత్రి సమయంలో చలి ఉంటుంది.
అల్-హుతైబ్ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు కూడా ఈ వాతావరణం అలవాటే. వర్షాలు పడని ప్రాంతంగా పేరు పొందడంతో ఇక్కడికి పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తారు. ఎత్తైన కొండపై నిలబడి మేఘాల నుంచి వర్షం భూమిపై పడే అద్భుత దృశ్యాలను వీక్షిస్తారు. ఇక్కడ అల్ బోహ్రా, ముఖర్మ తెగలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎక్కువగా ప్రాచీన, ఆధునిక పద్ధతుల్లో నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.