ఉత్తర మధ్య మయన్మార్‌లోని సగయింగ్ ప్రాంతంలోని లాట్ యాట్ కోన్ గ్రామంలో గల పాఠశాలపై ఆర్మీ హెలికాప్టర్ ఫైరింగ్ చేసింది. ఈ దాడిలో ఏడుగురు పిల్లలతో సహా కనీసం 13 మంది మరణించారు. దీనిని పాఠశాల నిర్వాహకుడు, సహాయక కార్యకర్త ధృవీకరించారు. మయన్మార్‌లో సైన్యం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూనే ఉంది. అయితే ఒకే చోట చాలా మంది పిల్లలు చంపబడటం బహుశా ఇదే మొదటి సంఘటన. మరోవైపు, భద్రతా సిబ్బందిపై దాడి చేయడానికి తిరుగుబాటుదారులు స్కూల్ భవనాన్ని ఉపయోగిస్తున్నారని, అందుకే కాల్పులు జరిపినట్లు సైన్యం చెబుతోంది.
గ్రామంలోని బౌద్ధ విహారంలో నిర్మించిన పాఠశాలపై సైన్యం కాల్పులు జరిపింది. సైన్యం చిన్నారుల మృతదేహాలను 11 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి తీసుకెళ్లి పాతిపెట్టిందని పాఠశాల నిర్వాహకుడు మార్బుల్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాఠశాల భవనంలోని గోడలకు బుల్లెట్ రంధ్రాలు, రక్తం చిమ్మినట్లు చూపించాయి. ఆ ప్రాంతానికి ఆయుధాలను రవాణా చేసేందుకు తిరుగుబాటు గ్రూపులు మఠాన్ని ఉపయోగించుకుంటున్నాయని సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
గత ఏడాది ప్రారంభంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడం ద్వారా మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్ హింసాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఉద్యమాలు మొదలయ్యాయి. వారిని అణిచివేయడానికి సైన్యం బలప్రయోగం చేస్తుంది. ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈ దాడి జరిగిందని సైన్యం తెలిపింది. హెలికాప్టర్‌లో పంపిన భద్రతా బలగాలు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు, మఠం లోపల దాడి చేశారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో కొందరు గ్రామస్థులు మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు. గ్రామస్తులను తిరుగుబాటుదారులు కవచాలుగా ఉపయోగించుకున్నారని సైన్యం తెలిపింది. అక్కడ 16 హ్యాండ్ మేడ్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.