ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదం జరిగింది. రన్‌వేపై ఉన్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఒమన్ దేశంలోని మస్కట్ ఎయిర్‌పోర్టులో జరిగింది. విమానం రెండో ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737-800 విమానం మస్కట్ నుంచి కొచిన్ బయల్దేరే ముందు ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో క్యాబిన్‌లో పొగతో నిండిపోయిందని డీజీసీఏ వెల్లడించింది. భారీగా మంటలు రావడంతో దట్టమైన పొగ.. విమానాన్ని కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ఆపేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. విమానంలోని ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. కాగా ప్రయాణికులు కొచిన్‌కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విమానంలో నలుగురు చిన్నారులు, ఆరుగురు సిబ్బంది సహా 141 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 141 మంది ప్రయాణికులను విమానంలోని స్లైడ్‌ల ద్వారా తరలించారు. ఘటన జరిగిన వెంటనే ఎయిరిండియా పొగలు కమ్ముకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దట్టమైన తెల్లటి పొగ మధ్య ఎయిర్‌ఇండియా విమానం ఎయిర్‌పోర్టు సిబ్బంది చుట్టుముట్టినట్లు వీడియోలో కనిపించింది.