టర్కీలోని స్కీ రిసార్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 32 మంది మంటల ధాటికి గాయపడినట్లు చెప్పారు. బోలు ప్రావిన్స్‌లోని స్కీ రిసార్ట్‌లోని 12వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు బాధితులు వెంటనే భయంతో రిసార్ట్ భవనం పైనుంచి దూకి మరణించారని అక్కడి గవర్నర్ అబ్దుల్ అజీజ్ ఐడిన్ చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు షీట్లు, దుప్పట్లు ఉపయోగించి తమ గదుల నుంచి దిగడానికి ప్రయత్నించారని స్థానిక మీడియా తెలిపింది. కాగా ప్రమాద సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు బస చేసినట్లు చెప్పారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలు సహాయక చర్యలు చేపట్టాయి.