పేజర్ల పేలుడు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు

హిజ్బుల్లాహ్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన వందలాది మంది సభ్యులు సమాచార వ్యవస్థ కోసం ఉపయోగించే పేజర్‌లు మంగళవారం లెబనాన్, సిరియాలో ఒకేసారి పేలాయి.

By అంజి  Published on  18 Sep 2024 3:15 AM GMT
Lebanon, pager blasts, Hezbollah , Israel, internationalnews

పేజర్ల పేలుడు.. 9 మంది మృతి.. 2,750 మందికి గాయాలు

హిజ్బుల్లాహ్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన వందలాది మంది సభ్యులు సమాచార వ్యవస్థ కోసం ఉపయోగించే పేజర్‌లు మంగళవారం లెబనాన్, సిరియాలో ఒకేసారి పేలాయి. ఎనిమిదేళ్ల బాలికతో సహా తొమ్మిది మంది మరణించారు. అనేక వేల మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో లబెనాన్‌లో తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అలాగే మరణించిన వారిలో లెబనీస్‌ పార్లమెంట్‌లోని హెజ్బొల్లా ప్రతినిధి అలీ అమ్మర్‌ కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

2,750 మంది గాయపడినట్టు తెలుస్తోంది. వందలాది మంది తీవ్రంగా గాయపడినందున మృతుల సంఖ్య పెరుగుతుందని అంచనా. కాగా పేజర్లు పేలిన ఘటనలో ఇజ్రాయెల్‌ కుట్ర ఉందని హెజ్బోల్లా అనుమానం వ్యక్తం చేసింది. దీనికి ఇజ్రాయెల్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు బ్యాటరీలు హీటెక్కేలా సైబర్‌ ఎటాక్‌ చేశారని కొన్ని రిపోర్టులు తెలిపాయి. పేజర్లు సప్లై చేసే ముందు వాటిలో పేలుడు పదార్థాలు ఉంచినట్టు మరిన్ని రిపోర్టులు పేర్కొన్నాయి.

కాగా గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలని, ఇజ్రాయెల్ ఉల్లంఘనలను నివారించడానికి దాని స్వంత టెలికమ్యూనికేషన్ సిస్టమ్‌పై ఆధారపడాలని హిజ్బుల్లా తన సభ్యులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా అనేక వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలను పేల్చివేసినట్లు లెబనీస్ అంతర్గత భద్రతా దళాలు తెలిపాయి.

ఇజ్రాయెల్ యొక్క మొస్సాద్ గూఢచారి సంస్థ మంగళవారం పేలుళ్లకు ఐదు నెలల ముందు లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఆదేశించిన 5000 తైవాన్-నిర్మిత పేజర్లలో కొద్ది మొత్తంలో పేలుడు పదార్థాలను అమర్చిందని సీనియర్ లెబనీస్ భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు పేర్కొన్నాయి.

Next Story