ఇరాక్ అగ్ని ప్రమాదంలో 82 కి చేరిన మృతులు
82 killed in Iraq as fire erupts at COVID-19 hospital. ఇరాక్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 82 కి చేరింది.
By Medi Samrat Published on 26 April 2021 2:34 AM GMTఇరాక్‌లోని కోవిడ్ ఆస్పత్రిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 82 కి చేరింది. మరో 110 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌లోని ఇబన్ అల్ ఖతీబ్ హాస్పిటల్ ఐసీయూలో ఆదివారం తెల్లవారుజామున ఆక్సిజన్ సిలిండర్లు పేలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించగా.. ప్రస్తుతం మృతుల సంఖ్య 82కి పెరిగింది. ఆక్సిజన్ సిలిండర్ల పేలిపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని, ఆస్పత్రిలో ఎటువంటి ఫైర్ సేఫ్టీ వ్యవస్థ కూడా లేదని స్థానిక మీడియా పేర్కొంది. ముందుగా ఐసీయూలో చెలరేగిన మంటలు తర్వాత అన్ని అంతస్తులకు వ్యాపించాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది వెంటలేటర్లపై ఉండటంతో వాటి తొలగించి బయటకు తరలించేలోపు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు పొగతో ఊపిరాడక చనిపోయారు. భవనం అంతా మృత దేహాలతో నిండిపోవటం చూసినవారి మనసులను మెలితిప్పేస్తోంది.
అయితే, ఈ ప్రమాదానికి నిర్లక్ష్యంతో పాటు అవినీతే కారణమని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక, ఇరాక్ ఆస్పత్రులను దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. కనీస సౌకర్యాలకు అక్కడ ప్రభుత్వం నిధులు వెచ్చించడం లేదు. ఔషధాలు, బెడ్స్ కొరతతో తీవ్రంగా ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆరోగ్య శాఖకు బాగ్దాద్ గవర్నర్ మొహమూద్ జబేర్ సూచించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, విధుల్లో అలసత్వం చూపినవారి గుర్తించి శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఆస్పత్రి ముఖ్య అధికారులతో పాటూ బాగ్దాద్ ఆరోగ్య విభాగం డైరెక్టర్ జనరల్ ను విధులనుంచి తొలగించారు. ఘటనపై ఇరాక్ ప్రధాని సైతం విచారం వ్యక్తం చేశారు.