సముద్రంలో పడవ మునిగి 77 మంది మృతి చెందిన విషాద ఘటన సిరియా తీరంలో జరిగింది. బతుకుదెరువు కోసం పొట్ట చేతబట్టుకుని లెబనాన్ నుంచి ఐరోపాకు వెలుతున్న వలసదారుల పడవ మధ్యధరా సముద్రంలో గురువారం మునిగిపోయింది.
2019 నుంచి లెబనాల్‌లో కరువు విలయతాండవం చేస్తోంది. తినడానికి తిండి కూడా కరువైపోయింది. దీంతో అక్కడి ప్రజలు సిరియా, పాలస్తీనాకు అక్రమంగా వలస వెలుతున్నారు. ఈ క్రమంలో పలు ప్రమాదాల బారిన పడి మార్గమధ్యంలోనే మరణిస్తున్నారు. తాజా ఘటన కూడా అలాంటిదే.
తీవ్ర ఆర్థిక మాద్యంలో కూరుకుపోయిన లెబనాన్‌లో ఉపాధి కరువవడంతో అక్కడి ప్రజలు సిరియాకు సముద్రమార్గంలో అక్రమంగా వలస వస్తున్నారని సిరియా ఆరోగ్య శాఖ మంత్రి హసన్ అల్ ఘబాశ్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలోనే సిరియా సముద్ర తీరంలో వారి పడవ మునిగిపోయిందని, 77 మంది చనిపోయారని చెప్పారు. ప్రమాదం సమయంలో పడవలో సుమారు 150 మంది ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతోనే పడవ మునిగిపోయిందన్నారు.
పడవ ముగినిపోయిందన్న సమాచారం అందగానే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారన్నారు. 20 మంది వరకు కాపాడామని, ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వారి కోసం సముద్రంలో గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.