భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు

7.1 magnitude earthquake hits northern Philippines report. ఫిలిప్పీన్స్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో ఇవాళ ఉదయం భూమి

By అంజి  Published on  27 July 2022 10:07 AM IST
భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు

ఫిలిప్పీన్స్‌ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1 గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం ధాటికి మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని అక్కడి అక్కధికారులు తెలిపారు. అబ్రా ప్రావిన్స్‌లో భవనాలు కిటికీలు ధ్వంసం కాగా.. ఇళ్లల్లోని వస్తువుల కిందపడిపోయాయి.

భారీ భూకంపం నేపథ్యంలో డోలోరెస్‌లో ప్రజలు భయాందోళనకు గురై తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానిక మార్కెట్‌లోని కిటికీలు పగిలిపోయాయని పోలీసు మేజర్ ఎడ్విన్ సెర్గియో తెలిపారు. "భూకంపం చాలా బలంగా వచ్చింది. పోలీసు స్టేషన్ భవనంలో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయి." అని సెర్గియో చెప్పారు భూ ప్రకంపనల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

"భూకంపం కారణంగా బజారులో విక్రయించే కూరగాయలు, పండ్లు కిందపడిపోయాయి. రోడ్లు అస్తవ్యస్థంగ మారాయి. బ్యాంగ్‌డ్ పట్టణంలోని తారు రోడ్డు, మైదానంలో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే దుకాణాలు, ఇళ్లకు ఎటువంటి నష్టం జరగలేదు. బ్యాంగ్‌డ్‌లో చాలా మంది గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు.'' అని పోలీసు చీఫ్ మేజర్ నజారెనో ఎమియా చెప్పారు.

యూనివర్శిటీ విద్యార్థిని మీరా జపాటా శాన్ జువాన్ పట్టణంలోని తన ఇంట్లో ఉన్నప్పుడు "నిజంగా వణుకుతున్నట్లు" అనిపించిందని చెప్పారు. భూకంపం రావడంతో తాము అరుస్తూ బయటకు పరుగెత్తామని ఆమె చెప్పింది. 2013లో సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లోని బోహల్‌ ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 200 మంది మరణించారు. 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. ఇక 1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించింది.

Next Story