ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 81 మందికి గాయాలు

6 Dead In Suicide Bombing At Istanbul Shopping Street. టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 81 మందికి తీవ్రగాయాలయ్యాయి.

By అంజి  Published on  14 Nov 2022 6:59 AM IST
ఇస్తాంబుల్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 81 మందికి గాయాలు

టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 81 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇస్తాంబుల్‌లోని ఓ మార్కెట్‌ దగ్గర ఈ భారీ పేలుడు సంభవించింది. నగరంలోని ప్రముఖ ఇస్తిక్లాల్‌ అవెన్యూ వద్ద ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పోలీసులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుడు శబ్దం వినబడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు తీశారు.

అక్కడ ఉన్న షాపులను వెంటనే మూసివేశారు. పేలుడు కారణంగా నలుగురు మరణించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్‌ అలీ యెర్లికాయ ట్వీట్‌ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇస్తాంబుల్‌లో ఈ మార్కెట్‌ ప్రాంతం పర్యాటకులు, స్థానికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.

''ఆదివారం ఇస్తాంబుల్‌లోని ఇస్టిక్‌లాల్‌లోని బిజీ షాపింగ్ స్ట్రీట్‌లో గుర్తు తెలియని బలమైన పేలుడు సంభవించింది. ఆరుగురు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు'' అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడని టర్కీ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ నీచమైన దాడి వెనుక.. నిందితులను కనిపెట్టేందుకు సంబంధిత విభాగాలు పనిచేస్తున్నాయి అని రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పారు. 2015-2016లో ఇస్తాంబుల్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడుల ప్రచారంలో గతంలో ఇస్తిక్‌లాల్ స్ట్రీట్ దెబ్బతింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ క్లెయిమ్ చేసిన ఆ దాడుల్లో దాదాపు 500 మంది మరణించారు మరియు 2,000 మందికి పైగా గాయపడ్డారు.

Next Story