మిస్సిస్సిప్పిలో వరుస కాల్పులు.. 6 గురు మృతి
6 Dead in series of shootings in US's Mississippi.అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి.
By తోట వంశీ కుమార్
అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు. ఈ ఘటన మిస్సిస్సిప్పీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేట్ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్‌లోకి శుక్రవారం ఓ దుండగుడు చొరబడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం దుండగుడు అక్కడకు సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి మరో ఇద్దరిని కాల్చి చంపేశాడు. ఆ తరువాత అర్కబుట్ల డ్యామ్ వద్ద మరో ఇద్దరిని కాల్చడంతో వారు మరణించారు. వరుస కాల్పుల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు అధికారులు చెప్పారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడు కారులో పారిపోతున్నట్లు సమాచారం అందడంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు.
దీనిపై మిస్సిస్సిప్పీ గవర్నర్ టేట్ రీవ్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "టేట్ కౌంటీ వరుస కాల్పులు బాధాకరం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఇంకా తెలియరాలేదు. విచారణ జరుగుతోంది. త్వరలోనే దీని వెనుక ఉన్న కారణాలు బయటకు వస్తాయి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అని గవర్నర్ తెలిపారు.
— Governor Tate Reeves (@tatereeves) February 17, 2023
ఇదిలా ఉంటే.. . కొద్ది రోజుల క్రితం ఈస్ట్ లాన్సింగ్‌లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.