శాండ్‌విచ్‌లు తిన్న 500 మందికి అస్వస్థత.. 12 మంది పరిస్థితి విషమం
ఓ బేకరీలో బన్ మి శాండ్‌విచ్‌లు తిన్న సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
By అంజి Published on 7 May 2024 2:02 PM ISTశాండ్‌విచ్‌లు తిన్న 500 మందికి అస్వస్థత.. 12 మంది పరిస్థితి విషమం
ఓ బేకరీలో బన్ మి శాండ్‌విచ్‌లు తిన్న సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ అనుమానంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దక్షిణ వియత్నాంలోని డాంగ్ నై ప్రావిన్స్‌లో జరిగింది. అస్వస్థతకు గురైన వారిలో 6, 7 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు చిన్నారులతో సహా 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. బేకరీని తాత్కాలికంగా మూసేశారు. తీవ్ర ఎండల కారణంగా శాండ్‌విచ్‌లు పాడైపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అధికారుల ప్రాథమిక తనిఖీల్లో.. బేకరీలో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. బన్ మి ట్రెడిషనల్ వియత్నమీజ్ శాండ్‌విచ్. ఇది ఫ్రెంచ్ స్టైల్ బ్రెడ్‌లో నాన్‌వెజ్, వెజిటెబుల్స్‌తో నింపి ఉంటుంది. ఏప్రిల్ 30న లాంగ్ ఖాన్ నగరంలోని బ్యాంగ్ బేకరీలో శాండ్‌విచ్‌లు తిన్న 560 మంది అస్వస్థతకు గురైనట్లు టౌన్ అధికారులు ధ్రువీకరించారు.
అస్వస్థతకు గురైన వారిలో 200 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ట్రాన్ క్వాంగ్ డయూ కాలనీలోని ఈ బేకరీ రోజుకి 1,100 శాండ్‌విచ్‌లను అమ్ముతుందని అధికారుల అంచనా. ఫుడ్ పాయిజనింగ్ అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతోందని లోకల్ హాస్పిటల్ నివేదికలు చెబుతున్నాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన వారిలో విరేచనాలు, వాంతులు, జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉన్నాయి. డాంగ్ నై పిల్లల హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల తల్లితో వియత్నమీజ్ వార్తాపత్రిక హెల్త్ అండ్ లైఫ్ మాట్లాడింది.
ఆమె తన పిల్లలకు ఎక్కువ నాన్‌వెజ్‌తో కూడిన శాండ్‌విచ్‌లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత 24 గంటల్లో వారిలో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించడం ప్రారంభించాయని ఆమె చెప్పారు. అస్వస్థతకు గురైన వారి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించినప్పుడు, వారు తిన్న మాంసం, చీజ్, పండ్లతో సహా ఇతర ఉత్పత్తుల్లో ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయని లోకల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. టువోయ్ ట్రె న్యూస్ ప్రకారం.. తదుపరి పరీక్షల కోసం బన్ మి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.