సెంట్రల్ కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం నాడు బొగొటాకు వెళ్తున్న చిన్న విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు రాజకీయ నాయకులు మృతి చెందారు. మృతి చెందిన వారు కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్ యొక్క రైట్ వింగ్ సెంట్రో డెమొక్రాటికోకి చెందిన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. మాజీ సెనేటర్ నొహోరా తోవర్, డిపార్ట్‌మెంటల్ చట్టసభ సభ్యుడు డిమాస్ బారెరో, ఎలియోడోరో అల్వారెజ్, విల్లావిసెన్సియో మునిసిపల్ కౌన్సిలర్ ఆస్కార్ రోడ్రిగ్జ్‌లతో సహా సభ్యుల ప్రాణాలను బలిగొన్న "విషాదం"పై ఆ పార్టీ ట్విట్టర్‌లో విచారం వ్యక్తం చేసింది.
పౌర విమానయాన అథారిటీ ప్రకారం.. శాన్ లూయిస్ డి గసెనో మునిసిపల్ ప్రాంతంలో విమానం కూలింది. స్థానిక మీడియా ప్రకారం.. తమ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు విల్లావిసెన్సియా నుంచి బొగొటాకు విమానంలో వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆ దేశ సివిల్ ఎవియేషన్ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. కాగా విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.