అతడికి 45 ఏళ్లు.. 18 ఏళ్ల యువకుడిలా మారాలని.. ప్రతి ఏడాది రూ.16 కోట్లు
45 Year old CEO spends Rs 16 crore every year to look 18.45 ఏళ్ల ఓ వ్యక్తి తన వయసును తగ్గించుకునే పనిలో ఉన్నాడు
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2023 8:22 AM ISTఏ వ్యక్తిలోనైనా అయినా వయసు పెరిగే కొద్ది మార్పులు రావడం సహజం. క్రమంగా వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యంలో ఇంకొకరి సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. చాలా మందిలో వయసు మీద పడుతున్నప్పటికీ యవ్వనంలో ఉన్నట్లుగా కనిపించాలనే ఫీలింగ్ ఉంటుంది. ఇది చాలా కష్టం. మొత్తంగా అలా కనిపించకున్నప్పటికీ వ్యాయామం, ఆహార నియమాలను పాటించడం ద్వారా కొంత మేర ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే.. 45 ఏళ్ల ఓ వ్యక్తి తన వయసును తగ్గించుకునే పనిలో ఉన్నాడు. ఇందులో కొంత మేర విజయం సాధించినట్లు చెప్పాడు. 18 ఏళ్ల కుర్రాడిలా కనిపించడమే తన లక్ష్యం అని అంటున్నాడు.
బ్రయాన్ జాన్సన్ వయసు 45 ఏళ్లు. కాలిఫోర్నియాలో నివాసం ఉండే ఇతడు ఓ వ్యాపారవేత్త. అతడు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు ప్రత్యేక వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఇందు కోసం సంవత్సరానికి 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
శరీరంలో మార్పులు చేసినట్లయితే వయసు ప్రభావం కనిపించదని జాన్సన్ ఎక్కడో చదివాడు. దీంతో తాను 18 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాడో తిరిగి అలా కనిపించాలని అనుకున్నాడు. ఇందుకోసం ఎందరో వైద్యులను సంప్రదించాడు. చివరకు అతడికి 29 ఏళ్ల వైద్యుడు ఆలివర్ జోల్మాన్ పరిచయం అయ్యాడు. అతడి నేతృత్వంలోని వైద్య బృందం జాన్సన్ కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది.
ఇప్పటికే చాలా రోజులు చికిత్స తీసుకుంటుంగా తన శరీరంలో మార్పులు వచ్చినట్లు జాన్సన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పుడు తన శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా, గుండె పనితీరు 37 ఏళ్ల వ్యక్తిలా, శరరీ నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నట్లు చెప్పాడు.
జాన్సన్ శరీరభాగాల పని తీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యులు అతడిని పర్యవేక్షిస్తుంటారు.ఇందుకోసం కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని జాన్సన్ నివాసంలో ఆరోగ్య సంరక్షణ సూట్, ఇంకా కావాల్సిన అన్నీ సిద్దం చేశారట. ఈ సంవత్సరం కూడా 2 మిలియన్ల డాలర్ల ఖర్చు చేసేందుకు జాన్సన్ సిద్దంగా ఉన్నాట. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు ఇలా తన శరీరంలోని ప్రతీ అవయవం 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స తీసుకుంటానని అతడు చెబుతున్నాడు.