ఒక్క నెలలోనే 44లక్షల మంది ఉద్యోగాలకు బైబై
4.4 Million Americans quit jobs at record pace for second month in row.కరోనా మహమ్మారి ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 11:02 AM GMTకరోనా మహమ్మారి ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. ఒకప్పుడు చిన్న ఉద్యోగం వచ్చినా చాలు ఎగిరిగంతులేసేవారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా (పని ఒత్తిడి పెరిగినా, బాస్‌తోనో, సహోద్యోగులతోనో విభేదాలు వచ్చినా, విధుల్లో అసంతృప్తి ఉన్నా) ఎలాగోలా సర్దుకుపోయారు తప్ప జాబ్స్‌ను వదిలేందుకు మానేయడానికి సిద్దపడేవారు కాదు. అయితే.. కరోనా గుణపాఠం నేర్పిందనే చెప్పాలి. ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసినా.. కష్టకాలంలో యాజమాన్యాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపర్చింది. అధిక గంటలు పని, లే ఆఫ్‌లు, వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుంది. ఇది ఉద్యోగుల్లో మార్పు తెచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు
ఇటీవల అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. అక్కడి మార్కెట్‌లో ప్రస్తుతం 1.04 కోట్ల జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఆగస్టులో 43లక్షల మంది తమ ఉద్యోగాలను వదిలివేయగా.. సెప్టెంబరులో 44లక్షల మంది ఉద్యోగాలను మానేశారు. దేశంలోని మొత్తం శ్రామిక వర్గంలో ఇది 3 శాతంగా ఉంది. కొత్త మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు. అధిక జీతం లభించే మార్గాల వైపు వారు దృష్టిసారిస్తున్నారు. తక్కువ వేతనం వచ్చే జాబ్స్‌ను చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.
ఇక అమెరికాలో శీతాకాల సెలవుల నేపథ్యంలో కొనుగోళ్ల హడావుడి ప్రారంభంకానుంది. రిటైలర్, ఆన్‌లైన్ డెలివరీ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అవసరం అయినప్పటికి వారికి ఉద్యోగార్థులు లభించడం లేదు. దీంతో కొన్ని సంస్థలు గంటకు అధిక మొత్తంలో చెల్లించేందుకు సిద్దపడి మరీ పెద్దమొత్తంలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెజాన్ శాశ్వత ప్రాతిపదికన 1.25 లక్షల మంది డ్రైవర్లు, గోదాం కార్మికులను తీసుకుంది. వీరికి గంటకు 18 నుంచి 22 డాలర్లు ఇవ్వనుంది. 3 వేల డాలర్ల బోనస్ ఇచ్చేందుకూ ఒప్పుకొంది. ప్రస్తుతం అక్కడ ఏ ప్రాంతంలోని షాపులను చూసినా.. ఉద్యోగులు కావలెను అనే ప్రకనలు కనిపిస్తున్నాయి.