సోమాలియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. ఓ హోటల్‌లోకి చొరబడి ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. మొత్తం ఈ ఘటనలో 40 మంది మృతి చెందారు. మరో 70 మందికిపైగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రాజదాని మెగాదిషులో ఉన్న హయత్ హోటల్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సోమాలియలో ఎంతో ప్రసిద్ధి చెందిన హోటళ్లలో.. హయత్ హొటల్ ఒకటి. ఇక్కడికి పెద్ద పెద్ద నేతలు, చట్ట సభ్యులు, ప్రభుత్వ అధికారులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అల్ షబాబ్ ఉగ్రవాదులు గెస్ట్‌ల రూపంలో వచ్చారు. ఆ వెంటనే ఓ వ్యక్తి ఆత్మహుతి దాడి చేశాడు. మరికొందరు టెర్రరిస్టులు తుపాకులతో కాల్పులు జరిపారు. హోటల్ రూమ్‌ల్లో ఉన్న గెస్ట్‌లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. హయత్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. హోటల్‌లోకి వెళ్లేందుకు ఎంతగానో ప్రయత్నించాయి. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరపడంతో.. మొదట కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అదనపు బలగాలు కూడా రావడంతో సైనికులు హోటల్‌లోకి వెళ్లి.. ఉగ్రవాదులపై ఎదురు దాడి చేశారు. ఈ ఆపరేషన్ 30 గంటల పాటు సాగింది.
అల్-ఖైదా తీవ్రవాద గ్రూపుకు అల్ షబాబ్ అనుబంధంగా పని చేస్తూ వస్తోంది. ఈ టెర్రరిస్టు సంస్థ సోమాలియా గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 14వ తేదీన అమెరికా బలగాలు జరిపిన కాల్పుల్లో 13 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు హతమయ్యారు. హోటల్ పై దాడి ఘటనను వివిధ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని యూఎన్ ప్రకటన విడుదల చేసింది.