Mexico Migrant Centre : ఘోర అగ్నిప్ర‌మాదం.. 40 మంది వ‌ల‌స‌దారులు స‌జీవ‌ద‌హ‌నం

సొంత దేశంలో ఉపాధి ల‌భించ‌క అమెరికాకు వెళ్లి బ్ర‌తకాల‌ని ఆశ‌ప‌డిన 40 మంది వ‌ల‌స‌దారులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2023 7:47 AM GMT
Mexico Migrant Centre, US Border

గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న దృశ్యం


సొంత దేశంలో ఉపాధి ల‌భించ‌క అమెరికాకు వెళ్లి బ్ర‌తకాల‌ని ఆశ‌ప‌డిన 40 మంది వ‌ల‌స‌దారులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో కొంద‌రు చేసిన పని వారి పాలిట మృత్యుశాప‌మైంది.

మెక్సికోలోని సరిహద్దు నగరమైన సియుడాడ్ జుయారెజ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న వలసదారుల నిర్బంధ కేంద్రంలో సోమవారం రాత్రి మంటలు చెల‌రేగాయి. మెక్సికో యొక్క నేషనల్ మైగ్రేషన్ ఇన్స్టిట్యూట్ ఈ కేంద్రాన్ని నడుపుతోంది. మంటలు చెలరేగిన సమయంలో ఈ కేంద్రంలో 68 మంది ఉన్నారు. వీరిలో 40 మంది మంట‌ల్లో స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మ‌రో 28 మంది గాయాలు అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో వెనిజులా దేశానికి చెందిన వారే అధికంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

సియుడాడ్ జుయారెజ్ న‌గ‌రం అమెరికా స‌రిహ‌ద్దుకు స‌మీపంలో ఉంటుంది. వ‌ల‌స‌దారులు లేదా శ‌ర‌ణార్థులుగా అమెరికాలో ప్ర‌వేశించేందుకు వ‌చ్చేవారు సంబంధిత ప్ర‌క్రియ అధికారికంగా పూర్తి అయ్యే అవ‌ర‌కు సియూడ‌డ్ వారెజ్‌లోని తాత్కాలిక శిబిరాల్లో ఆశ్ర‌యం పొందుతుంటారు.

అయితే.. ఈ వ‌ల‌స‌దారుల నిర్భంధ కేంద్రంలో ఉంటున్న వారిని అమెరికాకు కాకుండా త‌మ సొంత దేశాల‌కే తిప్పిపంపేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌న్న వార్త‌లు వినిపించాయి. దీంతో శ‌ర‌ణార్థుల్లో ఆందోళ‌న మొద‌లైంది. దీనిపై వారిలో కొంద‌రు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ సోమ‌వారం రాత్రి బాగా పొద్దుపోయాక త‌మ కేంద్రంలో ప‌రుపుల‌కు నిప్పుపెట్టారు. అనూహ్యంగా మంట‌లు క్ష‌ణాల్లో శిబిరం మొత్తం వ్యాపించాయి.

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ విషాద సంఘటనపై "సమగ్ర దర్యాప్తు" కోసం పిలుపునిచ్చారు.

Next Story