నేపాల్‌లో ప్ర‌ళ‌య విలయం.. 38 మంది మృతి.. ముగ్గురు భారతీయులు మిస్సింగ్

38 People killed in rain triggered landslides floods in Nepal.నేపాల్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2021 5:24 AM GMT
నేపాల్‌లో ప్ర‌ళ‌య విలయం.. 38 మంది మృతి.. ముగ్గురు భారతీయులు మిస్సింగ్

నేపాల్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం జరిగింది. గడిచిన 20 రోజుల వ్యవధిలో ఈ ప్రకృతి విలయం దాటికి 38మంది మృతిచెందగా.. 50మందికి పైగా గాయపడినట్టు నేపాల్‌ హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. 51 మంది గాయాల పాలయ్యారు. ముగ్గురు చిన్నారులు సహా 24 మంది వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైనట్టు వివరించింది. వరదలతో మొత్తంగా 790 ఇళ్లు నీట మునగగా పలు వంతెనలు ధ్వంసమైనట్టు పేర్కొంది.

జూన్ 15 న, ఖాట్మండుకు ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ నేపాల్ సింధుపాల్‌చౌక్ జిల్లాలోని మేలంచి నది వెంబడి ఉన్న పట్టణాలు, నగరాలపై వరద నీరు పోటెత్తింది. కనీసం ఆరుగురు మృతి చెందగా, మరో 20 మంది తప్పిపోయారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత కూడా, నిపుణులు వరదకు ఖచ్చితమైన మూలం గురించి తెలుసుకోలేకపోయారు. భ్రేమతంగ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో నదిని అడ్డుకున్నట్లు ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది మేలంచి నది నీటి దిశని సుమారు 45 నిమిషాలు అడ్డుకుంది. ఈ వరద మేలంచి నీటి సరఫరా ప్రాజెక్టును ప్రభావితం చేసింది. ఈ ప్రాజెక్టు నేపాల్ దేశంలోనే అతిపెద్దది. ఖాట్మండు లోయలో నీటి కొరతను తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ 27.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా నదిని మళ్లించింది. అదృష్టవశాత్తూ నిర్వహణ కోసం వరదకు ఒక రోజు ముందు ప్రాజెక్ట్ యొక్క సొరంగం మూసివేయబడింది. దీంతో అది దెబ్బతినలేదు. కాని దాని క్యాంప్‌సైట్ కొట్టుకుపోయింది. ముగ్గురు చైనీస్, ముగ్గురు భారతీయులు, ఇద్దరు నేపాలీలు కనిపించడం లేదు.

నేపాల్‌లో సింధుపాల్ చౌక్ జిల్లాలో ఐదుగురు, దోతి జిల్లాలో నలుగురు, గోర్ఖాలో ముగ్గురు, రోల్పాలో మరో ముగ్గురు మరణించారు. చితావన్, తన్హూన్, ప్యుతాన్, రౌతహత్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. లలిత్‌పూర్, ఖోటాంగ్, సప్తారి, కేవర్, దాడింగ్, సింధూలి, జుమ్లా, అర్ఘాఖాచీ, దంగ్, పల్పా, కస్కి, కాలికోట్, పంచ్‌తర్, బఝంగ్, బజూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 5,100 మంది ప్రజలు నిరాశ్రులయ్యారు.

Next Story