అక్కడ యుద్ధం మొదలైంది.. ఆపాలని కోరుతున్న ఐక్యరాజ్యసమితి
Israel and Gaza War. ఇజ్రాయెల్ గాజా పై విరుచుకుపడింది. ఆ తర్వాత గాజా నుండి కూడా రాకెట్లు ఇజ్రాయెల్ పై దూసుకు వచ్చాయి.
By Medi Samrat Published on 12 May 2021 1:51 PM ISTఇజ్రాయెల్ గాజా పై విరుచుకుపడింది. ఆ తర్వాత గాజా నుండి కూడా రాకెట్లు ఇజ్రాయెల్ పై దూసుకు వచ్చాయి. హమాస్ ఉగ్రవాదుల అధీనంలోని గాజాలో 35 మంది పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ లో ముగ్గురు మరణించారు. మంగళవారం రాత్రి గాజా దాడులకు తెగబడగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గాజాలోని హమాస్ తీవ్రవాదులు, ఇతర ఇస్లాం గ్రూపులు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, బీర్షెబా నగరాలపై రాకెట్లతో దాడులు చేశాయని, ఫలితంగానే తాము గాజాపై ప్రతిదాడికి దిగాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ అధికార వర్గాలు తెలిపాయి.
హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని, తీవ్రవాద గ్రూపులోని నిఘా విభాగం నేతలు కొందరు చనిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది. 210 దాకా రాకెట్లను టెల్ అవీవ్, బీర్షెబాపై ప్రయోగించినట్టు హమాస్ ఆయుధ విభాగం ప్రకటించింది. బుధవారం ఉదయం కూడా ఈ దాడులు చోటు చేసుకున్నాయి. గాజా రాకెట్లను ఎదుర్కోడానికి గగన క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ ఉపయోగించింది. హమాస్ తీవ్రవాదులు అనేక రాకెట్లు ప్రయోగించగా, వాటిలో 90 శాతం రాకెట్లను ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ కుప్పకూల్చింది. గాజా, ఇజ్రాయెల్ లోని భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు దాడుల నుంచి కాపాడుకోవడానికి బేస్ మెంట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా రెండు దేశాల మధ్య జరిగిన భీకర దాడులు ఇవేనని అంటున్నారు.
ఇజ్రాయెల్ దాడిలో గాజాలోని 13 అంతస్తుల హందాయి టవర్ కుప్పకూలింది. ఈ భవనంలోనే హమాస్ ఉగ్రవాద నాయకుల గృహాలతో పాటు కార్యాలయాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆ ప్రాంతంలో దాడులు జరుగుతాయని ముందుగానే గ్రహించిన స్థానిక అధికారులు దాడికి ముందు ప్రజలను ఖాళీ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన 80 యుద్ధ విమానాలు దాడుల్లో పాల్గొన్నాయి. హమాస్ దాడులు ప్రారంభం కాగానే చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఇకనైనా ఇరు వర్గాలు శాంతియుతంగా వ్యవహరించాలని పలు దేశాలు హితవు పలుకుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా దాడులను ఆపాలని కోరింది.