పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ ఖ్వా (KPK) ప్రావిన్స్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల తీరా లోయలో పాక్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడుల్లో 30 మంది నిరపరాధ పౌరులు మృతిచెందిన ఘటన స్థానిక ప్రజల్లో విపరీత ఆగ్రహాన్ని రేపింది.
ఈ దాడులపై వ్యతిరేకంగా మత్రే దారా ప్రాంతంలోని ఆఫ్రిది పశ్తూన్ నాయకులు, గిరిజన పెద్దలు మరియు స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వారు పెషావర్‌లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాన్ని (PAF Base) ముట్టడించేందుకు కూడా సిద్ధమవుతున్నారని సమాచారం.
స్థానిక వర్గాల ప్రకారం, సైన్యం నిరపరాధులను లక్ష్యం చేస్తోందని, తాలిబన్లపై పోరాటం పేరుతో పశ్తూన్ ప్రజలను బలిగొడుతోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మత్రే దారా మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజా సమావేశాలు జరిగి, సైనిక దాడులను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక నినాదాలు వినిపిస్తున్నాయి. పశ్తూన్ తెగల నాయకులు స్పష్టంగా ప్రకటించారు – ఈ దాడులు ఆగకపోతే, పెషావర్ వైమానిక స్థావరం వద్ద ముట్టడి తప్పదని హెచ్చరించారు. ఈ పరిణామాలు పాక్ ప్రభుత్వం మరియు సైన్యం ఎదుర్కొంటున్న కొత్త తలనొప్పిగా మారాయి.