పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు. నగరంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) పారామిలటరీ దళాల ప్రధాన కార్యాలయంపై సోమవారం సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం ఎఫ్‌సీ హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో మొదట రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కాల్పుల మోత మొదలైంది. ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు ఓ సీనియర్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. ఒక ఉగ్రవాది ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకోగా, మరొకరు కాంపౌండ్‌లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆయన వివరించారు.
దాడి సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్ సైన్యం, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. హెడ్ క్వార్టర్స్ వెలుపల రహదారిని మూసివేసి, మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయం లోపల మరికొందరు ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానంతో భద్రతా దళాలు జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ దాడితో పెషావర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది