అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30గంటల సమయంలో యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ దుండగుడు ప్రవేశించాడు. యూనివర్సిటీ అకాడమీ బిల్డింగ్‌తో పాటు యూనియన్ బిల్డింగ్ వద్ద కాల్పులకు తెగబడ్డాడు. భయాందోళనకు గురైన విద్యార్థులు వెంటనే రూమ్‌లలోకి పరుగులు తీశారు.
ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసుటు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడికి సంబంధించిన ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అతడు మాస్క్ ధరించి ఉన్నాడు. కాల్పుల అనంతరం అతడు నడుచుకుంటూ వెళ్లిపోవడం సీసీటీవీలో రికార్డైందని పోలీసు ఆఫీసర్ క్రిస్ రోజ్‌మాన్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో 48 గంటల పాటు క్యాంపస్‌లో అన్ని తరగతులు, ఇతర కార్యకలాపాలను రద్దు చేశారు.