ఎనిమిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. 27 మంది దుర్మరణం
27 Feared dead in Osaka building fire.జపాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒసాకా నగరంలో
By తోట వంశీ కుమార్
జపాన్ దేశంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒసాకా నగరంలో రద్దీగా ఉండే ఓ ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ అంతస్తులో మానసిక ఆరోగ్య సేవలు మరియు సాధారణ వైద్య సంరక్షణ అందించే కిన్లిక్ ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం ఉదయం 10.18 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన స్థానికులు అధికారులు, ఫైరింజన్లకు సమాచారం ఇచ్చారు. వెంటనే 70 ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. దాదాపు అరగంట కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ భవనం లోపల అత్యంత ఇరుకుగా ఉండడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల వైఫల్యంతో 27 మంది మరణించారని అధికారులు తెలిపారు. కాగా.. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఒసాకా అగ్నిమాపక విభాగం అధికారి మీడియాతో మాట్లాడుతూ.. మంటల్లో గాయపడిన 28 మందిలో 27 మందిలో ఎటువంటి చలనం లేదని వారంతా మరణించినట్లు తెలిపారు. మిగిలిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. భవనం లోపలి కిటీలు అన్నీ నల్లగా మారినట్లు వెల్లడించారు.