స్వాతంత్ర దినోత్సవం నాడు.. 22 మంది మృతి.. రక్తపు ముద్దలే మిగిలాయ్‌

22 Reported Killed in Independence Day Attack in Ukraine.ఉక్రెయిన్ స‌ర్వ‌నాశ‌నం అవుతోంది. ఎటు చూసినా దిబ్బ‌లుగా మారిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2022 9:35 AM IST
స్వాతంత్ర దినోత్సవం నాడు.. 22 మంది మృతి.. రక్తపు ముద్దలే మిగిలాయ్‌

ఆరు నెల‌ల క్రితం ర‌ష్యా-ఉక్రెయిన్ ల మ‌ధ్య మొద‌లైన యుద్ధం ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌డం లేదు. ర‌ష్యా దాడుల్లో ఉక్రెయిన్ స‌ర్వ‌నాశ‌నం అవుతోంది. ఎటు చూసినా దిబ్బ‌లుగా మారిన భ‌వంతులు, అత్యాచారాల‌కు, హ‌త్యాచారాల‌కు గురైన బాధితులు, వాళ్ల కుటుంబాల ఆవేద‌నే క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని ఉక్రెయిన్ నిర్ణ‌యించుకుంది. అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ పిలుపు మేర‌కు బుధ‌వారం ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోవ‌త్స‌వ వేడుక‌ల‌కు ప్ర‌జ‌లు దూరంగా ఉన్నారు.

ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజున డ్నిప్రోపెట్రోవ్‌స్కీ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై రష్యా దళాలు రాకెట్‌తో దాడి చేయగా కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 50 మంది వరకు మరణించి ఉండొచ్చని జెలెన్‌స్కీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు. బుధ‌వారం సాయంత్రం ఐక్య‌రాజ్య స‌మితి(ఐరాస‌) భ‌ద్ర‌తా మండ‌లిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. "తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ ప్రాంతానికి 90 మైళ్ల దూరంలో ఉన్న చాప్లీన్ ప‌ట్ట‌ణంలో ఓ రైలు మీద మిస్సైల్ ప్ర‌యోగం జ‌రిగింది. నాలుగు రైల్వే క్యారేజీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 22 మంది స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. చాప్లీన్‌కు తగిలిన గాయం మమ్మల్ని బాధిస్తోంది "అని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ర‌ష్యాకు ఎప్ప‌టికీ లొంగ‌బోమ‌ని, 2014లో ర‌ష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు అన్ని ఉక్రెయిన్ భూభాగాల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌న్నారు.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో భారత్‌ 12వ మానవతా సహాయాన్ని ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉందని యూఎన్‌ఎస్‌సీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రుచిరా కాంబోజ్ తెలిపారు. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం యూరప్‌కే పరిమితం కాదని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతపై ఆందోళనలు పెంచుతోందన్నారు.

Next Story