ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ పేలుడు.. 22 మంది మృతి
22 Dead and dozens injured after explosion at historic Havana hotel.ఫైవ్ స్టార్ హోటల్‌లో శక్తివంతమైన పేలుడు
By తోట వంశీ కుమార్ Published on 7 May 2022 3:22 AM GMTఫైవ్ స్టార్ హోటల్‌లో శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన క్యూబా దేశ రాజధాని హవానాలో శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. హవానాలో 'సరటోగా' అనే ఫైవ్‌స్టార్ హోటల్ ఉంది. దీనిని 1930లో నిర్మించారు. ఈ హోటల్‌లో 96 గదులు, రెండు రెస్టారెంటులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హోటల్‌లో పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. కాగా.. శుక్రవారం గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి హోటల్ భవనం ధ్వంసమైంది. కిటికీలు ఊడిపోయాయి. గోడలు మొత్తం ధ్వంసమయ్యాయి. హోటల్ వెలుపల పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఆకాశంలో కమ్ముకుంది.
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. కొందరు ఘటనాస్థలంలో, మరికొందరు చికిత్స పొందుతూ.. ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మరో 70 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. కాగా.. మరణించిన వారంతా హోటల్ సిబ్బంది అని తెలుస్తోంది.
ఈ పేలుడులో విదేశీయులు గాయపడినట్లు లేదా మరణించినట్లు తమకు సమాచారం లేదని పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ గార్సియా గ్రాండా తెలిపారు. గ్యాస్ ట్యాంక్‌ను రీఫిల్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని హోటల్ యాజమాన్యంలోని రాష్ట్ర కంపెనీ గవియోటాకు చెందిన రాబర్టో కాల్జాడిల్లా చెప్పారు. ఇంకా హోటల్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పేలుడు జరిగిన వెంటనే ఈ హోటల్ పక్క ఉన్న పాఠశాలను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. కాగా.. పేలుడు సమయంలో హోటల్ దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.