చైనాలో పెను విషాదం చోటు చేసుకుంది. వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకోవడంతో మారథాన్‌లో పాల్గొన్న వారిలో 21 మంది రన్నర్లు మృతి చెందారు. ఈ ఘటన చైనాలోని గన్సు ప్రావిన్స్‌కు వాయువ్యంగా ఉన్న బైయిన్ సిటికి సమీపంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బైయిన్ నగరానికి సమీపంలోని యల్లో రివర్ స్టోన్ అటవీ ప్రాంతంలో కొండలపై శనివారం ఉదయం 100 కిలోమీటర్ల పర్వత మారథాన్ నిర్వహించారు. ఇందులో 172 మందికిపైగా పాల్గొన్నారు. పరుగు కొనసాగుతుండగా.. మధ్యాహ్నాం 2 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు వడగళ్లు, మంచు వర్షం, భీకర చలిగాలులు వీచాయి. దీంతో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు ఈ వాతావరణాన్ని తట్టుకోలేకపోయారు. అప్రమత్తమైన నిర్వాహకులు 3 గంటల సమయంలో మారథాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెంటనే స్థానికుల సాయంతో సహాయక బృందాలను రంగంలోకి దించాయి.
యెల్లో రివర్ స్టోన్‌ఫారెస్ట్ వెంట పరుగులు తీస్తున్న రన్నర్లలో చాలా మంది హైపోథెర్మియా(అల్పఉష్ణస్థితి)కు గురయ్యారు. 1200 మంది రెస్కూ టీంలుగా ఏర్పడి.. ఆదివారం ఉదయాని కల్లా 172 మంది పాల్గొన్న మారథాన్‌లో 151 మందిని సురక్షితంగా రక్షించారు. మిగిలిన 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు. చలికి తట్టుకోలేక, గడ్డ కట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు. కొంత మంది గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.