ఘోర ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
20 Dead after truck crashes into cars at toll booth.మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కార్గో ట్రక్కు బీభత్సం
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2021 8:50 AM GMT
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కార్గో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ మెక్సికోలోని హైవే పై ఉన్న ఓ టోల్ బూత్ వద్ద శనివారం ఓ వస్తువులను రవాణా చేసే కార్గో ట్రక్కు అదుపు తప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ మంటలు చెలరేగి పలు వాహనాలు దగ్థం అయ్యాయి. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ట్రక్కు బ్రేకులు ఫెయిలవడం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో కొన్ని వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలిపోతున్నవి కాగా.. మరికొన్ని పూర్తిగా దగ్థమైన తరువాత అక్కడి పరిస్థితికి సంబంధించినవి ఉన్నాయి. హైవేపై ప్రమాదం జరగడంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అధికారులు ఘటనాస్థలంలో ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.