అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. పెన్సిల్వేనియాలో స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మొదట ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆపై, వేగంగా దూసుకెళ్లి వంతెన పైనుంచి కిందకు పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు. ఇదే వాహనంలో ముందు సీటులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా గాయపడగా, అతడిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.
మృతిచెందిన విద్యార్థులు క్లీవ్‌లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్నారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం ధృవీకరించింది. మృతులను మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్‌లుగా గుర్తించినట్లు కాన్సులేట్ అధికారులు వెల్లడించారు.
క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషాద మరణాలపై న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా "తీవ్ర విచారం" వ్యక్తం చేసింది. X పై ఒక ప్రకటనలో, కాన్సులేట్ విద్యార్థుల కుటుంబాలతో సన్నిహితంగా ఉందని, సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు తెలిపింది.