టెక్సాస్‌లోని పాఠ‌శాల‌లో కాల్పులు.. 21 మంది మృతి.. వారిలో 18 మంది చిన్నారులు

18 Children among 21 killed in shooting at Texas elementary school.అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చోటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 May 2022 8:39 AM IST
టెక్సాస్‌లోని పాఠ‌శాల‌లో కాల్పులు.. 21 మంది మృతి.. వారిలో 18 మంది చిన్నారులు

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఓ పాఠ‌శాల‌లో ప్ర‌వేశించిన 18 ఏళ్ల యువ‌కుడు చిన్నారుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో 18 మంది చిన్నారుల‌తో పాటు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘ‌టన టెక్సాస్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. సల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏళ్ల‌ యువకుడు మంగళవారం మధ్యాహ్నం(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ఉవాల్డే ప‌ట్ట‌ణంలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లోకి ప్ర‌వేశించాడు. త‌న వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. ఆ స‌మ‌యంలో పాఠ‌శాల‌లో 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

యువ‌కుడి కాల్పుల్లో మొత్తం 21 మంది మ‌ర‌ణించారు. వారిలో 18 మంది చిన్నారులు, ముగ్గురు పెద్దవారు ఉన్నారని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్ వెల్ల‌డించారు. పోలీసుల కాల్పుల్లో ఆ యువకుడు హతమయ్యాడని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల వ‌య‌స్సు 4 నుంచి 11 ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌న్నారు. గత పదేండ్లలో అమెరికాలోని పాఠ‌శాల‌ల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో అతిపెద్దది ఇదేనని అభిప్రాయపడ్డారు. టెక్సాస్ చరిత్రలో.. అత్యంత దారుణ కాల్పుల ఘటన ఇద‌ని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ భవనాలు, మిలటరీ స్థావరాలు, నావల్ స్టేషన్స్​, అమెరికా రాయబార కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మే 28 సాయంత్రం వరకు అవనతం చేయాలని ఆదేశించారు.

కాగా.. 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జ‌రిగిన కాల్పుల్లో 14 మంది విద్యార్థుల‌తో పాటు ముగ్గురు టీచ‌ర్లు మృతి చెందారు. 2020 సంవ‌త్స‌రంలో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు.

Next Story