Pakistan: హోళీ వేడుకల్లో ఘర్షణ.. హిందూ విద్యార్థులపై దాడి, 15 మందికి గాయాలు

పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో సోమవారం హోలీ ఆడినందుకు హిందూ సమాజానికి చెందిన కనీసం 15 మంది విద్యార్థులపై దాడి చేశారు.

By అంజి  Published on  8 March 2023 6:40 AM GMT
Holi celebration, Pakistan, Punjab university

హోళీ వేడుకల్లో ఘర్షణ.. హిందూ విద్యార్థులపై దాడి

పక్క దేశం పాకిస్తాన్‌లోని పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్‌లో సోమవారం హోలీ ఆడినందుకు మైనారిటీ హిందూ సమాజానికి చెందిన కనీసం 15 మంది విద్యార్థులపై రాడికల్ ఇస్లామిక్ విద్యార్థి సంస్థ సభ్యులు దాడి చేశారు. రంగుల పండుగను జరుపుకోవడానికి పంజాబ్ విశ్వవిద్యాలయంలోని లా కాలేజీకి సుమారు 30 మంది హిందూ విద్యార్థులు సోమవారం గుమిగూడారు. క్యాంపస్‌లో హోలీ వేడుకలను వ్యతిరేకిస్తూ ఇస్లామీ జమియత్ తుల్బా (ఐజెటి) సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులపై దాడి చేయడం ప్రారంభించారు.

"లా కాలేజీ లాన్‌ల వద్ద విద్యార్థులు గుమిగూడగా, ఇస్లామీ జమియాత్ తుల్బా (IJT) కార్యకర్తలు హోలీ జరుపుకోకుండా వారిని బలవంతంగా అడ్డుకున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. దీని ఫలితంగా 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు" అని ప్రత్యక్ష సాక్షి కాషిఫ్ బ్రోహి చెప్పారు. హోలీ వేడుకల కోసం హిందూ విద్యార్థులు యూనివర్సిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారని బ్రోహి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హోలీని జరుపుకోవడానికి హిందూ విద్యార్థులతో కలిసి వచ్చిన సింధ్ కౌన్సిల్ అనే సంస్థ దాడిని ఖండించింది.

వైస్ ఛాన్సలర్ కార్యాలయం వెలుపల దాడిని నిరసిస్తూ, గార్డులు తమపై కూడా దాడి చేశారని గాయపడిన విద్యార్థుల్లో ఒకరైన ఖేత్ కుమార్ ఆరోపించారు. "మమ్మల్ని కొట్టి హింసించినందుకు ఇస్లామీ జమియాత్ తుల్బా, సెక్యూరిటీ గార్డులకు వ్యతిరేకంగా మేము పోలీసులకు దరఖాస్తు చేసాం, అయితే ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడలేదు" అని కుమార్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇండోర్ వేడుకలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు పంజాబ్ యూనివర్సిటీ ప్రతినిధి ఖుర్రం షాజాద్ తెలిపారు. దాడిపై వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు ఐజేటీ ఆరోపణలను ఖండించింది. దాడిలో సంస్థ సభ్యులెవరూ పాల్గొనలేదని పేర్కొంది. ఐజేటీ ప్రతినిధి ఇబ్రహీం షాహిద్ మాట్లాడుతూ.. "హిందూ విద్యార్థులతో ఘర్షణలో పాల్గొన్న విద్యార్థులలో ఎవరూ ఐజేటీకి చెందినవారు కాదు" అని తెలిపారు.

Next Story